
కె24న్యూస్ తెలుగు జూన్ 21. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గేసికపల్లిలో దళిత మహిళ మునిలక్ష్మమ్మపై జరిగిన దాడిని దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మునిలక్ష్మమ్మ మాట్లాడుతూ, సర్వే నెం.57/1Eలో ఉన్న సుమారు 2ఎకరాల 9సెంట్ల భూమిని తమ కుటుంబం దాదాపు 50సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోందని, అయితే శ్యామరాజుపురానికి చెందిన శ్యామరాజు మరియు అతని కుమారులు అక్రమంగా భూమిని ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగంగా కులం పేరుతో దూషించి, దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ఒక దళిత మహిళపై దాడి చేసి, కులం పేరుతో అవమానించడం రాజ్యాంగం కల్పించిన హక్కులపై దాడి చేసినట్లేనని దళిత నాయకులు పేర్కొన్నారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వ భూమిని దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్న పేద దళిత కుటుంబాన్ని బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడటం ఏ మాత్రం సహించబోమన్నారు. బాధిత కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున వెంటనే పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి, బాధితురాలికి రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూమి వివాదంపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక విచారణ నిర్వహించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. దళితులపై దాడులు, కుల వివక్ష, భూ ఆక్రమణ యత్నాలను ఉపేక్షిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు దళిత సంఘాలు అండగా నిలుస్తాయని స్పష్టం చేశారు. దళితులపై దాడులు ఆపాలి. బాధితులకు న్యాయం చేయాలి. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి అని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్, బహుజన సేన కుప్పం నియోజకవర్గ అధ్యక్షులు మహేష్, బహుజన సేన రాష్ట్ర కార్యదర్శి గోవిందప్ప, జిల్లా బహుజన సేన జిల్లా నాయకులు వేలు, బహుజన సేన,కుప్పం నియోజకవర్గ ఆటో సుబ్బన్న డి ఎస్ ఎస్ దళిత గోవిందప్ప మరియు దళిత సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.