కామారెడ్డి, జూన్ 26 (తెలుగు కే న్యూస్):
కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్ 38వ వార్డులో శుక్రవారం అర్ధరాత్రి సుమారు 1:30 గంటల సమయంలో సిరిసిల్లకు చెందిన సంజీవ్ అనే వ్యక్తి గాయాలతో అచేతన స్థితిలో రోడ్డుపై పడి ఉండడాన్ని పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కామారెడ్డి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అరుణ్ మోహన్ గుర్తించారు.
ఘటన స్థలానికి అంబులెన్స్ చేరుకున్నప్పటికీ ఇరుకైన దారి కారణంగా లోపలికి వెళ్లలేకపోయింది. దీంతో కానిస్టేబుల్ అరుణ్ మోహన్ మానవతా దృక్పథంతో స్పందించి, బాధితుడిని సుమారు 400 మీటర్ల దూరం స్ట్రెచర్‌పై మోసుకుంటూ అంబులెన్స్ వరకు తీసుకెళ్లి, అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సమయోచితంగా స్పందించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సహాయం చేసిన కానిస్టేబుల్ అరుణ్ మోహన్ సేవాభావాన్ని స్థానికులు అభినందించారు.