కామారెడ్డి జిల్లా:k24 న్యూస్ తెలుగు: ఆటో డ్రైవర్లు బాధ్యతారాహిత్యంగా వాహనాలు నడపకుండా, ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కామారెడ్డి డీఎస్పీ సూచించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత మరియు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్ ఉండాలని, డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించి, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహనాలు నడపాలని తెలిపారు. రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్లోడింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడటం లాంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అపరిచిత ఫోన్ కాల్స్, మోసపూరిత లింక్‌ల పట్ల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.
సమాజంలో ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు లేదా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఎస్సై నరేష్, ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్ గౌడ్, ఆటో డ్రైవర్ యూనియన్ ప్రతినిధులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని, నిబంధనలు పాటిస్తూ పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.