గేటు తెరవక గంటల తరబడి నిరీక్షణ.. ప్రిన్సిపాల్ వైఖరిపై అసంతృప్తి
తెలుగు కే న్యూస్ పటాన్‌చెరువు, సంగారెడ్డి జిల్లా:
పటాన్‌చెరువు మండలం ఇస్నాపూర్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ & జూనియర్ కళాశాల వద్ద ఆదివారం తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలు నోట్‌బుక్స్ లేవని చెప్పడంతో వాటిని అందించేందుకు వచ్చిన తమను పాఠశాల గేటు వద్దే నిలిపివేశారని వారు ఆరోపించారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు గేటు తెరవకపోవడంతో రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చిందని తల్లిదండ్రులు వాపోయారు. తమ పిల్లలకు నోట్‌బుక్స్ ఇచ్చి పలకరించి వెళ్లేందుకు వచ్చినప్పటికీ, పాఠశాల యాజమాన్యం తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులకు కనీస గౌరవం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ, పాఠశాల ప్రిన్సిపాల్ వైఖరిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.