
కామారెడ్డి జిల్లా: తెలుగు కే న్యూస్
కామారెడ్డి నియోజకవర్గాన్ని విద్య, వైద్యం, క్రీడలు, సాగునీరు, మౌలిక వసతుల పరంగా రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కామారెడ్డి బాయ్స్ హైస్కూల్ అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరయ్యాయని, పాఠశాలను అత్యాధునిక సౌకర్యాలతో రోల్ మోడల్ ప్రభుత్వ పాఠశాలగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఇందిరాగాంధీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని, దోమకొండలో ఫైర్ స్టేషన్, 50 పడకల ఆస్పత్రి, ఎమ్మార్వో కార్యాలయాల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, రైతులకు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని షబ్బీర్ తెలిపారు.