హైదరాబాద్, జూన్ 12: నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న రాయల్ స్పైసీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్వహించిన తనిఖీల్లో తీవ్ర పరిశుభ్రత లోపాలు వెలుగుచూశాయి. కిచెన్, వాష్ ఏరియా, డైనింగ్ హాల్‌లలో ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల సందర్భంగా కిచెన్‌లో భారీ స్థాయిలో పురుగుల సంచారం కనిపించగా, వంటగది గోడలు, కిటికీలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. వంటకాల తయారీలో అధికంగా ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే తాగునీటి నాణ్యతకు సంబంధించిన ధ్రువపత్రాలు అందుబాటులో లేకపోవడం, ఆహార పదార్థాల సమీపంలో మూతలు లేని చెత్త డబ్బాలు ఉంచడం, వాష్ ఏరియా వద్ద ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం, నిల్వ నీరు మరియు దుర్వాసన ఉండటం వంటి లోపాలను నమోదు చేశారు. ఈ పరిస్థితులు ఆహారం కలుషితమై వినియోగదారుల ఆరోగ్యానికి హానికరంగా మారే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. గుర్తించిన లోపాలపై రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన అధికారులు, నిర్దేశిత గడువులోగా సరిదిద్దకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, గచ్చిబౌలి ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఇటీవల పలు హోటళ్లు, రెస్టారెంట్లు, జ్యూస్ సెంటర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ పరిశుభ్రత, ఆహార నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తోంది. ప్రజలకు సూచన: బయట భోజనం చేసే సమయంలో రెస్టారెంట్ పరిశుభ్రత, ఆహార నాణ్యతపై అప్రమత్తంగా ఉండాలని, ఆహార భద్రతకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు.