[caption id="attachment_5232" align="alignright" width="1920"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలం, మద్దేపల్లి: దేశ రక్షణలో సైనికుడిగా సేవలందిస్తూ.. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు మెడికల్ కవర్ అందించే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మద్దేపల్లి గ్రామానికి చెందిన బానోత్ రవీందర్ నాయక్. భారత సైన్యంలోని ఆర్మీ మెడికల్ కోర్ (AMC) విభాగంలో 25-03-2010 నుంచి విధులు నిర్వహిస్తున్న ఆయన.. దాదాపు 18 ఏళ్లుగా దేశ సేవలో భాగస్వామిగా కొనసాగుతున్నారు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రికి భద్రతా వైద్య సేవల్లో భాగస్వామ్యం
రవీందర్ నాయక్ తన విధుల్లో భాగంగా గతంలో 2012, 2013, 2014 సంవత్సరాల్లో అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు మెడికల్ కవర్ సేవల్లో పనిచేసినట్లు తెలిపారు. దేశ అత్యున్నత స్థాయి కార్యక్రమాల్లో వైద్యపరమైన అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండే బాధ్యతను నిర్వర్తించడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు.
తాజాగా 2026 జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతికి మెడికల్ కవర్ విధుల్లో భాగస్వామ్యం కావడం మరోసారి తనకు లభించిన గొప్ప అవకాశంగా రవీందర్ నాయక్ తెలిపారు.
అదేవిధంగా 2026 ఆగస్టు 15న నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మెడికల్ కవర్ ఇన్చార్జిగా విధులు నిర్వర్తించే అవకాశం దక్కడం తన సైనిక జీవితంలో మరపురాని ఘట్టమని ఆయన వెల్లడించారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో సేవలు
సైన్యంలో చేరిన అనంతరం రవీందర్ నాయక్ వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. 2014లో జమ్మూ కాశ్మీర్లో సేవలందించారు. అనంతరం 2017 నుంచి 2020 వరకు చెన్నై మిలిటరీ ఆసుపత్రిలో, ఆ తర్వాత 2020 అక్టోబర్ నుంచి 2024 జూన్ వరకు సికింద్రాబాద్లోని మిలిటరీ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించారు.
2024 జూలైలో న్యూఢిల్లీలోని బేస్ హాస్పిటల్కు పోస్టింగ్ రావడంతో మరోసారి దేశ రాజధానికి చేరుకున్నారు. గతంలో దేశ అత్యున్నత స్థాయి వ్యక్తుల మెడికల్ కవర్ విధుల్లో పనిచేసిన తనకు.. మళ్లీ అదే బాధ్యతల్లో సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని రవీందర్ నాయక్ తెలిపారు.
తల్లిదండ్రులు, గ్రామానికి రుణపడి ఉంటా
దేశ సేవ చేసే అవకాశం కల్పించిన ఆర్మీ మెడికల్ కోర్కు, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, తనను పెంచి పెద్ద చేసిన మద్దేపల్లి గ్రామానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని రవీందర్ నాయక్ భావోద్వేగంతో తెలిపారు.
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు.. క్రమశిక్షణ, అంకితభావంతో సైన్యంలో అడుగుపెట్టి.. దేశ ప్రధాని, రాష్ట్రపతి వంటి అత్యున్నత వ్యక్తులకు వైద్య భద్రతా సేవల్లో భాగస్వామిగా నిలవడం మద్దేపల్లి గ్రామానికే గర్వకారణంగా మారింది.
“దేశ సేవలో భాగం కావడం కంటే గొప్ప గౌరవం మరొకటి లేదు. నాకు అప్పగించిన ప్రతి బాధ్యతను దేశం కోసం అంకితభావంతో నిర్వహిస్తాను” అని రవీందర్ నాయక్ తెలిపారు.[/caption]