కామారెడ్డి జిల్లా : సెప్టెంబర్28:k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 117 ఫిర్యాదులు, వినతులు అందినట్లు తెలిపారు.
ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, ప్రతి ఫిర్యాదును నిబంధనల ప్రకారం సమగ్రంగా పరిశీలించి, అర్హత మేరకు సత్వర పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజావాణి ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువస్తున్నందున, ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలించి, పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, వారి సమస్యలను సానుకూలంగా విని నిబంధనల పరిధిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్ఓ పాండు, సీఈఓ చందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.