కామారెడ్డి జిల్లా:k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ పిలుపునిచ్చారు. సోమవారం కళాభారతీ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది విగ్రహాల రవాణా సమయంలో విద్యుత్ తీగలు తగిలి జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి విగ్రహాల ఎత్తు, రవాణా విషయంలో కఠిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద దొంగతనాల నివారణకు సీసీటీవీ కెమెరాలు, రాత్రివేళల్లో నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అగ్ని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నిపుణులతో ఏర్పాట్లు చేయించాలని స్పష్టం చేశారు. ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని, మద్యం సేవించడం, అసభ్యకర కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలుపాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.