కామారెడ్డి జిల్లా సెప్టెంబర్ 29 : k24 న్యూస్ తెలుగు: తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా జర్నలిస్టులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ తరగతులు మంగళవారం బాన్సువాడలోని SRNK డిగ్రీ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, బాన్సువాడలో జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో మరెక్కడా జరగలేదని పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులకు సమీపంలో ఉన్న బాన్సువాడలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించడం ఎంతో ప్రయోజనకరమన్నారు. సీనియర్ జర్నలిస్టుల అనుభవాలను పంచుకోవడం ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం, దాని ఆవిర్భావం, వార్తల విశ్వసనీయతపై జర్నలిస్టులు చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వార్తలు రాసేటప్పుడు వాస్తవాలను నిర్ధారించుకోవాలని, ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. జర్నలిస్టులు వృత్తిపరమైన హద్దులను పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టుగా పనిచేయడం కత్తి మీద సాము లాంటిదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను నిర్వహిస్తుంటే, జర్నలిస్టులు ప్రజాప్రతినిధుల పనితీరును ప్రజల ముందుకు తీసుకెళ్లే కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడే అంశాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, ప్రజాప్రతినిధులు తప్పు చేసినప్పుడు వాటిని ఎత్తిచూపే బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు.
వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సకాలంలో సమాచారాన్ని అందించడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. పత్రికల ద్వారా ప్రజలకు అనేక విషయాలు తెలుస్తాయని, జర్నలిజం పవిత్రమైన వృత్తి అని అన్నారు. జర్నలిస్టులు తన బిడ్డలతో సమానమని పేర్కొన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ఎల్ నినో ప్రభావంపై జర్నలిస్టులు రాసిన వార్తలను తాను చదివానని, జర్నలిస్టులు వార్తలు రాయడం తమ బాధ్యత కాగా, వాటిని చదివి తెలుసుకోవడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని అన్నారు.
శిక్షణ తరగతుల్లో భాగంగా, మంగళవారం ఉదయం సమాచార హక్కు చట్టం (RTI)పై దిలీప్ రెడ్డి జర్నలిస్టులకు అవగాహన కల్పించారు. అనంతరం నేర వార్తలకు సంబంధించిన అంశాలపై గోవింద్ రెడ్డి శిక్షణ ఇచ్చారు.
మధ్యాహ్నం సెషన్‌లో వార్తా కథనాలు, ప్రత్యేక కథనాల రచనపై దిశ ఎడిటర్ మార్కండేయ శిక్షణ అందించారు. అనంతరం ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్, ఏ1, సోషల్ మీడియా అంశాలపై ముద్దం నరసింహ స్వామి జర్నలిస్టులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, కామారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి, SRNK కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, టీజీ ఆగ్రో మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, కామారెడ్డి TUWJ అధ్యక్షులు వీర మాచినేని రజనీ కాంత్, IJU కౌన్సిల్ సభ్యులు సేపూరి వేణుగోపాల్ చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.ఏ. లతీఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు పట్నం శ్రీనివాస్, కార్యదర్శి బైరి సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ తరగతులకు ముందు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలోని జర్నలిస్ట్ కాలనీలో పర్యటించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం, కాలనీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల మీడియా అకాడమీ చైర్మన్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని అభినందించారు.