[caption id="attachment_6526" align="alignright" width="1280"]
నిర్మల్ జిల్లా, బాసరలోని శ్రీ వేద భారతి పీఠంలో దేశ క్షేమం, ప్రజా క్షేమం, ధర్మ సంస్థాపన, లోక కళ్యాణం లక్ష్యంగా నిర్వహిస్తున్న ధర్మ రక్షణ మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతోంది. పవిత్ర గోదావరి తీరానికి సమీపంలో ఉన్న ఈ పీఠంలో పీఠాధిపతి బ్రహ్మశ్రీ వేద విద్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో వేదమూర్తులైన ఋత్విక్కులు ఈ నెల 17వ తేదీ నుంచి శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు నిర్వహిస్తున్నారు.
సనాతన ధర్మ పరిరక్షణ, వేద వైదిక సంప్రదాయాల ప్రచారం లక్ష్యంగా చేపట్టిన ఈ మహాయజ్ఞంలో దేశ శాంతి, సుభిక్షం, ప్రజల ఆయురారోగ్యాలు, ధర్మబద్ధ పరిపాలన కోసం ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. స్వస్తి వాచనం ద్వారా దేశానికి సర్వారిష్ట శాంతి, విఘ్న నివారణ కోరగా, ఆయుష్య హోమం ద్వారా ప్రజల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని ఆకాంక్షించారు. ధన్వంతరి హోమంలో రోగ నిర్మూలన, ఆరోగ్య భారత నిర్మాణం కోసం ప్రార్థనలు నిర్వహించగా, రాజ్యాధికార హోమంలో పాలకులకు ధర్మబుద్ధి, సత్యనిష్ఠ, సుపరిపాలనా శక్తి కలగాలని వేద మంత్రోచ్చారణలతో ఆరాధనలు చేపట్టారు.
వేద మంత్ర ఘోషలతో పీఠ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగుతోంది. దేశ ఐక్యత, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు స్వామీజీ తెలిపారు. యజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.[/caption]