నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
సిద్దిపేట, అక్టోబర్ 1 (కే24 న్యూస్): ఒంటరిగా వెళ్తున్న మహిళా ఉద్యోగినిపై కర్రతో దాడి చేసి, ఆమె మెడలోని బంగారు గొలుసును దొంగిలించేందుకు యత్నించిన నిందితుడిని సిద్దిపేట రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.సిద్దిపేట రూరల్ సీఐ సీహెచ్. విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. తోగుట మండలం వరదరాజుపల్లి గ్రామానికి చెందిన పత్రి అరవింద్ (24) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గతంలో చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారం దొంగిలించాలని పథకం వేసుకున్నాడు. సెప్టెంబర్ 29న సాయంత్రం 4.45 గంటల సమయంలో ఇరుకోడు గ్రామ శివారులోని వైకుంఠధామం సమీపంలో కాపుకాశాడు. పాఠశాలలో విధులు ముగించుకుని ఎలక్ట్రిక్ స్కూటీపై సిద్దిపేట వైపు ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళా ఉద్యోగినిని అడ్డగించి, ముందుగా సిద్ధం చేసుకున్న కర్రతో ఆమె తలపై బలంగా కొట్టి బంగారు గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించాడు.బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో పాటు అటుగా ఇతరులు రావడాన్ని గమనించిన నిందితుడు పట్టుబడతాననే భయంతో తన ద్విచక్ర వాహనం, చెప్పులు, దాడికి ఉపయోగించిన కర్రను అక్కడే వదిలేసి పరారయ్యాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు రాబరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా అక్టోబర్ 1న సాయంత్రం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ కేసును ఛేదించిన సిద్దిపేట రూరల్ సీఐ సీహెచ్. విద్యాసాగర్, ఎస్ఐ డి. నవత, ఏఎస్ఐ మక్సూద్, కానిస్టేబుళ్లు రాజు, నాగరాజు, మహేష్, శ్రీనివాస్, రమేష్, రాకేష్‌లను పోలీస్ కమిషనర్ అభినందించారు.