కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి జిల్లా గిరిజన విద్యార్థుల సమస్యలు, లంబాడి హక్కుల సాధన కోసం గిరిజన విద్యార్థి సంఘం ( జి.వి.ఎస్.), లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్.హెచ్.పి.ఎస్.) ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారిని కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు చౌహాన్ వినోద్ నాయక్ మాట్లాడుతూ, గిరిజనులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఎస్టి.ఎస్సీ.బీసీ. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని, సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని కోరారు.
అలాగే తండాలను రెవెన్యూ గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి, తండాల అభివృద్ధి కోసం ఒక్కో గ్రామపంచాయతీకి రూ.5 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఆయన జయంతి వేడుకల నిర్వహణకు రూ.100 కోట్లు కేటాయించాలని కోరారు.
షాద్‌నగర్ నియోజకవర్గం, కొత్తూరు మండలం, సిద్ధాపూర్ పరిసర ప్రాంతాల్లోని లంబాడి తండాల భూములను పరిరక్షించేందుకు జీ.ఓ. 641ను వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రత్యేకంగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసి, దానికి సంత్ సేవాలాల్ మహారాజ్ యూనివర్సిటీగా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.గిరిజన విద్యార్థులు, గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చౌహాన్ వినోద్ నాయక్ తెలిపారు.