Logo
Date of Publish : 04 September 2026, 12:34 pm
Editor : Katta Ravindar

రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి. మల్లికార్జున్ ఖర్గే ని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్

కామారెడ్డి జిల్లా:k24 న్యూస్ తెలుగు : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పై కుల వివక్షకు పాల్పడిన ఘటనను ప్రశ్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

నిజాంసాగర్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు , మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.

దేశంలో కుల వివక్షకు, అంటరానితనానికి, మనిషిని మనిషిగా తక్కువ చేసి చూసే విధానాలకు స్థానం లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు పాల్గొన్న సభా ప్రాంగణాన్ని గంగా జలాలతో శుద్ధి చేశారంటూ వచ్చిన ఘటన తీవ్రంగా ఖండించదగినదని అన్నారు.

ఖర్గే ఒక దళిత నాయకుడు కావడం వల్ల ఆయన పాల్గొన్న ప్రదేశాన్ని శుద్ధి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని భావించడం అత్యంత దురదృష్టకరం. ఇది కేవలం ఖర్గే ని అవమానించడం కాదు.. రాజ్యాంగాన్ని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను అవమానించడమే అని షబ్బీర్ అలీ అన్నారు.

కుల వివక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ పోరాటం చేస్తూనే ఉందని, భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

కులం మనిషి పుట్టుకను నిర్ణయించవచ్చు కానీ అతని గౌరవాన్ని నిర్ణయించదు. ప్రతి భారతీయుడికి ఆత్మగౌరవంతో జీవించే హక్కు ఉంది. రాజ్యాంగం ఇచ్చిన సమానత్వాన్ని ఎవరూ కాలరాయలేరుఅని అన్నారు.

ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ గొంతును అక్రమ కేసులతో అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని షబ్బీర్ అలీ ఆరోపించారు.

ప్రజల తరఫున ప్రశ్నించడం రాహుల్ గాంధీ హక్కు. ప్రశ్నించే గొంతును కేసులతో భయపెట్టాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరింత బలంగా ప్రజల మధ్య నిలబడతారు. రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి” అని డిమాండ్ చేశారు.

ఖర్గేని అవమానించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

కేసీఆర్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి – షబ్బీర్ అలీ

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. ప్రజల కోసం పనిచేయని నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి పదవి ఎందుకు? ప్రజల సమస్యలను పట్టించుకోని కేసీఆర్ వెంటనే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాలి” అని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.

కామారెడ్డి ప్రజలను కేసీఆర్ క్షమాపణ కోరాలని అన్నారు.

కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. ఈ ప్రాంత ప్రజలకు ఏం చేశారు వారి సమస్యల గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడారు ప్రజలకు చెప్పాలి.

వరదలు, భారీ వర్షాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన సమయంలో బాధితులను పరామర్శించడానికి కూడా కేసీఆర్ రాలేదు. కేటీఆర్ రాలేదు. బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రజల పక్కన నిలబడలేదు” అని విమర్శించారు.

బీఆర్‌ఎస్ పార్టీకి భారీగా నిధులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, కామారెడ్డి ప్రజలకు కనీస సహాయం కూడా చేయలేదని ఆరోపించారు.

“బీఆర్‌ఎస్ ఖాతాలో వందల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని చెబుతున్నారు. కామారెడ్డిలో పోటీ చేసిన కేసీఆర్ ఆ నిధుల నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఎంత సహాయం చేశారు? ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? ప్రజలు దీనిపై సమాధానం కోరుతున్నారు” అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధం..

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయని షబ్బీర్ అలీ అన్నారు.

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఏమి చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో ఏమి చేసింది? ప్రజల ముందే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనను, కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యం, రైతులు, మహిళలు, యువత, పేదల సంక్షేమం వంటి అన్ని అంశాల్లో పోల్చుకుందాం” అని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులకు మద్దతు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్లు, స్మార్ట్ రేషన్ కార్డులు, విద్యా సంస్థల అభివృద్ధి, ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల బలోపేతం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే మా లక్ష్యం” అని షబ్బీర్ అలీ అన్నారు.

కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, గ్రంధాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్, పీసీసీ జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, PACS చైర్మన్లు గూడెం శ్రీనివాస్ రెడ్డి, అంతంపల్లి సుధాకర్ రెడ్డి, భీమ్ రెడ్డి, నవసిలాల్ నాయక్ , అనంత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు నరేందర్ రెడ్డి, పాత రాజు, అంకం కృష్ణారావు, ఆశబోయిన శ్రీనివాస్ , రాజా గౌడ్ , జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, మహిళా కాంగ్రెస్, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )