భీమిని, తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 22: మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడిలో జీపీవో దుర్గాప్రసాద్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పెద్దంపేట గ్రామానికి చెందిన రైతు మహమ్మద్ ఫకీర్‌కు సంబంధించిన సాదాబైనామా పట్టా మార్పిడి చేసేందుకు జీపీవో లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.లంచం డిమాండ్‌పై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు బుధవారం పథకం ప్రకారం లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. మహమ్మద్ ఫకీర్ నుంచి రూ.80 వేల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలోని అధికారులు దాడి చేసి దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అనంతరం దుర్గాప్రసాద్‌ను కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ విధుల్లో అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.