తిరుమలగిరి: ధాన్యానికి మద్దతు ధర తగ్గించారంటూ రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు రాస్తారోకో నిర్వహించారు. మొన్నటి వరకు క్వింటాల్ ధాన్యానికి రూ.3,600 ధర ఉండగా, ప్రస్తుతం రూ.2,500కు తగ్గించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యానికి కనీసం రూ.4,000 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధాన్యం ధరలను తగ్గిస్తూ రైతులను నష్టాలపాలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ప్రభుత్వం స్పందించి ధాన్యానికి తగిన మద్దతు ధర కల్పించాలని కోరారు.
రైతుల రాస్తారోకోతో మార్కెట్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.