K24 News Telugu
Date of Publish : 29/10/2026, 9:46 pm
Published By BHOOM REDDY CH

విద్యపై దృష్టి సారించి , చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి :సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్

  • ఈ సమయాన్ని వృథా చేసుకోకండి. ఈ సమయం మళ్లీ తిరిగి రాదు
  • ఆన్‌లైన్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

గజ్వేల్ : మహతి ఆడిటోరియం లో షి టీమ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సీపీ రష్మి పెరుమాళ్, ఐపీఎస్  మాట్లాడుతూ విద్యార్థులు విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా విద్యపై దృష్టి సారించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ సూచించారు.

విద్యార్థుల్లో నేరప్రవృత్తిని నివారించడం, రహదారి భద్రత, మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.. ఇటీవల నిర్వహించిన క్రైమ్ రివ్యూలో మైనర్లు నేరాల్లో పాల్గొంటున్న ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోందని తెలిపారు. విద్యార్థులు తమకు లభిస్తున్న విద్యావకాశాలను, స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 మైనర్లు వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు 12, 13 ఏళ్ల వయసులోనే బండి నడుపుతూ మార్కెట్‌కు వెళ్లి వస్తున్నారని గర్వంగా భావిస్తున్నారని, కానీ ప్రమాదం జరిగినప్పుడు దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ఆ వయసులో విద్యపై దృష్టి సారించి, కొత్త నైపుణ్యాలను నేర్చుకుని భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. తాత్కాలిక ఆకర్షణలకు లోనై చెడు మార్గాల్లోకి వెళ్లి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.

“ఈ సమయాన్ని వృథా చేసుకోకండి. ఈ సమయం మళ్లీ తిరిగి రాదు” అని పేర్కొంటూ, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రతి నిమిషం ఎంత విలువైనదో తెలుసని, విద్యార్థులు కూడా సమయ ప్రాధాన్యతను గుర్తించాలని తెలిపారు. కోరుకున్న వస్తువులు లేదా మొబైల్ ఫోన్ కొనివ్వలేదనే కారణంతో కొందరు విద్యార్థులు తీవ్ర నిర్ణయాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక బలాన్ని పెంపొందించుకోవాలని, సమస్యలను మనసులో దాచుకోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా తన విద్యార్థి జీవితంలో ఎదురైన అనుభవాలను, ఉపాధ్యాయులు చెప్పిన ప్రేరణాత్మక విషయాలను గుర్తుచేసుకున్నారు. ఉపాధ్యాయులు అందించే మార్గదర్శకత్వం విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పులకు దోహదపడుతుందని పేర్కొన్నారు. మహిళల భద్రతకు సంబంధించిన కార్యక్రమాలు కేవలం మహిళలకే పరిమితం కావని, పురుషులు కూడా వాటిపై అవగాహన కలిగి ఉండాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. మహిళల పట్ల గౌరవభావంతో వ్యవహరించాలని, లింగ వివక్షకు తావులేకుండా సమానత్వాన్ని పాటించాలని సూచించారు. మహిళల భద్రత కోసం చేపడుతున్న ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని, మహిళలకు భద్రతతో కూడిన వాతావరణాన్ని కల్పించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఆన్‌లైన్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులను క్లిక్ చేయడం, వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం, ఓటీపీలు ఇతరులతో పంచుకోవడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని, ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సామాజిక జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారికి సరైన డీ-అడిక్షన్ చికిత్స, కౌన్సెలింగ్ అందించడం ద్వారా వారు తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చేందుకు సహాయపడవచ్చని తెలిపారు.

ఎవరైనా మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు లేదా వాటికి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, గజ్వేల్ ఎస్‌హెచ్‌ఓ రవి కుమార్, సీఐలు రవి రాజు, ఇన్స్పెక్టర్ లతీఫ్, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ దుర్గ, సుజాత డిగ్రీ కళాశాల లెక్చరర్, శ్వేత మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు, షీ టీమ్స్ బృందం సభ్యులు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save