K24 News Telugu
Date of Publish : 30/10/2026, 10:13 pm
Published By Teegala sravan Kumar

ఆసుపత్రుల నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి.

  • తుది దశలో ఉన్న భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలి
  • ఇంజనీరింగ్ , వైద్యశాఖ అధికారులతో ఐడీఓసీలో జిల్లా కలెక్టర్ సమీక్ష.

రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 30, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

జిల్లాలో నూతన ఆసుపత్రుల భవన నిర్మాణ పనులను ప్రణాళికా ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల నిర్మాణం, అలాగే జిల్లా కేంద్రంలోని జీ జీ హెచ్, ఏరియా ఆసుపత్రి, సీ హెచ్ సీ ల్లో వసతుల కల్పన తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, పంచాయతీరాజ్ శాఖ, టీజీఎంఐడీసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 15 ఆర్థిక సంఘం నిధులతో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 16 సబ్ సెంటర్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే 7 పూర్తి అయ్యాయి. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయని, రుద్రంగి మండల కేంద్రంలో పీహెచ్ సీ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని జిల్లా కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. టీజీఎంఐడీసీ ఆధ్వర్యంలో ఇల్లంతకుంటలో సీ హెచ్ సీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో ఆసుపత్రుల భవన నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తుది దశలో ఉన్న భవన నిర్మాణ పనులను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని వసతులతో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని జీ జీ హెచ్, వేములవాడ ఏరియా ఆసుపత్రి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట సీ హెచ్ సీ ల్లో కావాల్సిన వైద్యయంత్ర పరికరాలు, సామగ్రి, అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయించాలని ఆదేశించారు. ఇల్లంతకుంట సీ హెచ్ సీ నిర్మాణ పనులను గడువులోగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుభాషిణి, వైద్యులు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save