రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ, అక్టోబర్ 30, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులు మరియు రాబోయే కార్తీక మాసంలో భక్తులకు కల్పించాల్సిన మెరుగైన వసతులపై హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ.ఏ.ఎస్. శ్రీమతి శైలజ రామ్ అయ్యర్ , దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ ఐ.ఏ.ఎస్. శ్రీ హనుమంతరావు , దేవాదాయ ధర్మాదాయ ధార్మిక అడ్వైజర్ శ్రీ గోవింద హరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
రాజన్న ఆలయానికి అనుబంధ అలయమైన శ్రీ భీమేశ్వరాలయంలో రాబోయే కార్తీక మాస దీపోత్సవాలు, పూజల నిమిత్తం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, మరియు ప్రత్యేక దర్శనాల ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి పాల్గొని, అధికారులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. సమీక్షలో ఆర్ అండ్ బి (R&B) చీఫ్ ఇంజనీర్ (CE), కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్‌లు మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.