రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 31, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం మండేపల్లిలోని టీజీ ఎంఎస్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి కళలు, సాంస్కృతిక పోటీల్లో సిరిసిల్ల పీహెచ్సీ శ్రీ జెడ్పీఎస్ బాలికల పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ఇద్దరు విద్యార్థులు ప్రథమ బహుమతులు సాధించి పాఠశాలకు గుర్తింపు తెచ్చారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలు, సాంస్కృతిక ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో చిత్రకళ, సంగీతం, నృత్యం, హస్తకళలు ఇలా నాలుగు విభాగాల్లో పోటీలు జరిగాయి.
ఈ పోటీల్లో పి. అక్షర చిత్రకళ, బి. రుచిత హస్తకళల మొదటి బహుమతులు సాధించారు. విజేత విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎల్. శారద, డ్రాయింగ్ ఉపాధ్యాయుడు రమేష్, క్రాఫ్ట్ ఉపాధ్యాయురాలు మానస, తరగతి ఉపాధ్యాయుడు శ్రీనివాస్, సీనియర్ ఉపాధ్యాయులు తిరుపతి, సతీష్ బాబు తదితరులు ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, వారికి మార్గదర్శకత్వం అందించిన ఉపాధ్యాయులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.