K24 News Telugu
Date of Publish : 01/11/2026, 4:28 pm
Published By Gunnala Surendar

విజ్ఞాన్ స్కూల్‌లో బెస్ట్ అవైలబుల్ పథకం పేరుతో భారీ అక్రమాలు: TGVP

 నిజామాబాద్ జిల్లా: సుభాష్‌నగర్‌లోని విజ్ఞాన్ హైస్కూల్‌లో బెస్ట్ అవైలబుల్ పథకం పేరుతో భారీ అక్రమాలు జరుగుతున్నాయని TGVP జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ ఆరోపించారు. శనివారం TGVP కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2023 నుంచి 2026 వరకు మూడేళ్లలో ప్రభుత్వం నుంచి పాఠశాల యాజమాన్యం సుమారు రూ.1,29,19,920 నిధులు పొందినప్పటికీ, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.32 వేల చొప్పున అక్రమంగా వసూలు చేసిందని తెలిపారు.

RTI ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం యూనిఫాంలు, పుస్తకాలు, వసతి పేరుతో అదనపు ఫీజులు వసూలు చేసేందుకు అనుమతులు లేవని సంబంధిత శాఖ స్పష్టం చేసిందన్నారు. పాఠశాలలో ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకపోవడం, కనీస వసతుల కొరత, అర్హత లేని ఉపాధ్యాయుల నియామకం, సిబ్బందికి PF చెల్లించకపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. అధికారులకు దాదాపు 80 ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని, అక్రమంగా వసూలు చేసిన రూ.32 వేలను తల్లిదండ్రులకు తిరిగి ఇప్పించాలని, విద్యాశాఖ అధికారులు పాఠశాల అర్హతలు, వసతులను మరోసారి పరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే విద్యార్థి సంఘాలపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదులు చేయడాన్ని పోలీసు శాఖ గమనించాలని కోరారు. లేనిపక్షంలో బాధిత తల్లిదండ్రులతో కలిసి డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో కామారెడ్డి ఇన్‌చార్జ్ అనిరుధ్ రాజ్, నైతిక్, సాయి, సూరజ్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save