రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 2, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ఏఐటీయూసీరాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు ధర్నా చేసి, తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా ఇప్పటికీ వారిని రెగ్యులరైజ్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా టీచర్లకు, ఆయాలకు రూ.18 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.బీఎల్‌ఓ డ్యూటీలు రద్దు చేయాలని, సమ్మె కాలంలో కోల్పోయిన వేతనాలు చెల్లించాలని, పదవీ విరమణ తర్వాత నెలకు రూ.10 వేల పెన్షన్ అమలు చేయాలని నాయకులు కోరారు. ప్రీ-స్కూల్ విధానం అమలు వల్ల అంగన్‌వాడీ వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని పేర్కొంటూ, ప్రీ-స్కూల్ నిర్ణయాన్ని వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని, ప్రతి టీచర్, ఆయాకు రూ.25 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పించాలని, గ్రేడ్-2 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్లు చేశారు. పదవీ విరమణ చేసిన టీచర్లు, ఆయాలకు అనుబంధ సంక్షేమ పథకాలు అందించాలని, ఆరోగ్య కార్డులు జారీ చేయాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, సమ్మె కాలంలో నమోదైన కేసులను ఎత్తివేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు ఎదురుగట్ల మమత, చొప్పరి అంజలి, కరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సంఘటితంగా పోరాటం కొనసాగిస్తామని నాయకులు ప్రకటించారు.
