కోనరావుపేట మండలం, నవంబర్ 02, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
కోనరావుపేట మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ విద్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకొని.. వారి హాజరు రిజిస్టర్ పరిశీలించారు.
మెనూ చార్ట్ పరిశీలించి.. కిచెన్ గోదాంలో బియ్యం, పప్పులు ఇతర ఆహార పదార్థాలను నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఈ రోజు ఆహార పదార్థాలు సిద్ధంగా ఉన్నాయో పరిశీలించారు. మెనూ, భోజనం తదితర అంశాలపై విద్యార్థులతో ఆరా తీశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. హాస్టల్ ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు హాస్టల్ లో వసతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం ఉన్నత విద్య అభ్యసించాలని, అనుకున్న లక్ష్యం చేరుకోవాలని ఆకాంక్షించారు.