K24 News Telugu
Date of Publish : 02/11/2026, 11:35 pm
Published By Teegala sravan Kumar

చంద్రంపేట ట్రాఫిక్ చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు.

  • డివైడర్‌పై అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపు..
  • పాదచారులు సైతం రోడ్డు దాటే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

 సిరిసిల్ల పట్టణం, నవంబర్ 02, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

సిరిసిల్ల పట్టణం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు పరిధిలో గల రెండో బైపాస్ రోడ్డు, సిరిసిల్ల–కోనరావుపేట ప్రధాన రహదారులు కలిసే చంద్రంపేట ట్రాఫిక్ చౌరస్తా వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపడతామని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి తెలిపారు. స్థానిక కౌన్సిలర్లు మొగిలి నాగరాజు, బూర బాలు ఈ చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్ దృష్టికి తీసుకురావడంతో సోమవారం ఆమె సంబంధిత ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. చౌరస్తా మధ్యలో ఉన్న రోడ్డు డివైడర్‌పై పెరిగిన చెట్ల కారణంగా వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించడం లేదని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గుర్తించినట్లు తెలిపారు. వాహనదారులకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా ఈ సమస్యను సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజలు, వాహనదారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, మున్సిపల్ శాఖ తరఫున అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, తమ వాహనాలకు ఇన్సూరెన్స్ కలిగి ఉండటంతో పాటు వాహనాల కండిషన్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు. పాదచారులు సైతం రోడ్డు దాటే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించి జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె కోరారు. ఈ పర్యటనలో కౌన్సిలర్లు మొగిలి నాగరాజు, బూర బాలు, మాజీ కౌన్సిలర్ పాతూరి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, వార్డు అధ్యక్షులు వీరగోని శ్రీనివాస్, నర్మెట ప్రభు, తిరుపతి రెడ్డి, మల్లేశం, వీరగోని చందు, కత్తెర రాజు, పరుశురాములు, వార్డు పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save