సిరిసిల్ల పట్టణం, నవంబర్ 02, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
సిరిసిల్ల పట్టణ అభివృద్ధిలో భాగంగా స్థానిక 12వ వార్డులోని ఎస్సీ కాలనీలో రూ.6 లక్షల ఎంపీ నిధులతో చేపట్టనున్న సీసీ మురికినీటి కాలువ నిర్మాణ పనులకు సోమవారం భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సహకారంతో రాజ్యసభ సభ్యులు డి. దామోదర్ తన ఎంపీ నిధుల నుంచి సిరిసిల్ల పట్టణ అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.2 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. అందులో భాగంగానే 12వ వార్డు ఎస్సీ కాలనీలో రూ.6 లక్షలతో సీసీ మురికినీటి కాలువ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. కాలనీలో మురికినీటి పారుదల వ్యవస్థ సరిగా లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే ఆయన వెంటనే స్పందించి నిధులు మంజూరయ్యేలా కృషి చేశారని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన కేటీఆర్‌కు, నిధులు కేటాయించిన రాజ్యసభ సభ్యులు డి.దామోదర్‌కు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో సిరిసిల్ల పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడతామని, సిరిసిల్లను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మొగిలి నాగరాజు, బూర బాలు, పంచాయతీరాజ్ శాఖ ఏఈ అజారుద్దీన్, మాజీ కౌన్సిలర్ పాతూరి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, వార్డు అధ్యక్షులు వీరగోని శ్రీనివాస్, నర్మెట ప్రభు, తిరుపతి రెడ్డి, మల్లేశం, కత్తెర రాజు, పరుశురాములు తదితరులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.