రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 02, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలకు మించి బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సరఫరాల అధికారి తనూజ హెచ్చరించారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నిర్ణయించిన ధరలను వ్యాపారులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మార్గదర్శకాల ప్రకారం వివిధ రకాల బియ్యానికి గరిష్ట విక్రయ ధరలను నిర్ణయించింది. బీపీటీ/కేఎన్ఎం బియ్యం కిలో రూ.66, ఆర్ఎన్ఆర్/తెలంగాణ సోనా బియ్యం కిలో రూ.74, హెచ్ఎంటీ/జెఎస్ఆర్ బియ్యం కిలో రూ.79 చొప్పున విక్రయించాలని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు బియ్యం దుకాణాలను జిల్లా పౌర సరఫరాల అధికారి తనిఖీ చేశారు. జిల్లాలోని రైస్ మిల్లర్లు, రైస్ ట్రేడర్లు, హోల్‌సేల్ డిపో నిర్వాహకులు, రిటైలర్లు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలకు మించి బియ్యం విక్రయించరాదని ఆదేశించారు.
అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధరల వివరాలను విక్రయ కేంద్రాల వద్ద బ్యానర్ల రూపంలో స్పష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. వినియోగదారుల నుంచి నిర్ణీత ధరల కంటే అధిక మొత్తాన్ని వసూలు చేసిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి తనూజ స్పష్టం చేశారు.