K24 News Telugu
Date of Publish : 04/11/2026, 7:45 am
Published By Teegala sravan Kumar

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించరాదు:జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా

రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 03, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ గారు చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), రుద్రంగి సబ్ సెంటర్ మరియు మానాల బడి తండాలో ఆకస్మికంగా పర్యటించి వైద్య సేవలను, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులు, రిజిస్టర్లు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్య సేవలు (MCH), గర్భిణీ స్త్రీల ముందస్తు నమోదు, గర్భిణులకు అవసరమైన పరీక్షలు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (NCD) కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ నిర్దేశిత లక్ష్యాల మేరకు స్క్రీనింగ్ నిర్వహించి, వ్యాధులు గుర్తించిన వారికి సకాలంలో చికిత్స అందిస్తూ నిరంతరం ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు.

టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం కింద క్షయ వ్యాధి లక్షణాలున్న వారిని ముందుగానే గుర్తించి పరీక్షలు నిర్వహించాలని, వ్యాధి నిర్ధారణ అయిన వారికి వెంటనే చికిత్స ప్రారంభించి చికిత్స పూర్తయ్యే వరకు పర్యవేక్షించాలని తెలిపారు.

హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అవసరమైన వారికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించి, బాధితులకు క్రమం తప్పకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు.

అదేవిధంగా జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (NVBDCP) కింద డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధుల నివారణకు పారిశుద్ధ్య కార్యక్రమాలు, దోమల నివారణ చర్యలు, యాంటీ లార్వల్ కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతి మంగళవారం , శుక్రవారం డ్రై డే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను నిర్దేశించిన లక్ష్యాల మేరకు నాణ్యతతో అమలు చేయాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని డీఎంహెచ్‌ఓ సూచించారు.ఈ కార్యక్రమంలో చందుర్తి వైద్యాధికారి డాక్టర్ జీవన జ్యోతి, సంబంధిత వైద్య సిబ్బంది, ఇతర ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save