
మంత్రి శ్రీధర్‌బాబుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వినతి
హైదరాబాద్, తెలుగు కే న్యూస్ఆ గస్టు 12: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న బీటీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ లైన్ల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కామర్స్, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు వినతిపత్రం సమర్పించారు.భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో వర్షపు నీటి పారుదల వ్యవస్థ దెబ్బతినడంతో నీరు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొందన్నారు.ఉప్పల్ నియోజకవర్గంలో కొత్త బీటీ రోడ్ల నిర్మాణం, దెబ్బతిన్న సీసీ రోడ్ల పునర్నిర్మాణం, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ లైన్ల అభివృద్ధికి అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేయాలని మంత్రి శ్రీధర్‌బాబును ఎమ్మెల్యే కోరారు. ప్రజల సౌకర్యం, సురక్షిత రాకపోకలు, వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యల పరిష్కారానికి ఈ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.