బాసర అభివృద్ధి, పుష్కరాల ఏర్పాట్లపై అధికారుల సమన్వయ సమావేశం

నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు, గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆలయ ఈఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, మౌలిక వసతుల అభివృద్ధి, భక్తుల రాకపోకల నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.
గోదావరి పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశమున్నందున పటిష్ట పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు, వాచ్ టవర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ, ట్రాఫిక్ డైవర్షన్లు, పార్కింగ్ సదుపాయాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు.
అనంతరం బాసర ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్‌ను తరలించేందుకు ప్రతిపాదించిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఎస్పీ డా. జి. జానకి షర్మిల పరిశీలించారు. పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, బాసర ఆలయానికి వచ్చే భక్తులతో పాటు గోదావరి పుష్కరాలకు హాజరయ్యే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పుష్కరాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో అన్ని భద్రతా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్, ముధోల్ సీఐ రవీందర్ నాయక్, బాసర ఎస్‌హెచ్‌ఓ దీపక్, ఆలయ ఈఓ అంజనా దేవి, వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :