
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : ఫిర్యాదుదారుడు అసిస్టెంట్ ఇంజనీర్ జాదవ్ బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, గత ఐదు నెలలుగా భిక్నూర్ మండల పరిధిలోని బస్వాపూర్, భిక్నూర్, గుర్జకుంట, రమేశ్వరపల్లి, జంగంపల్లి, ర్యాగట్లపల్లి గ్రామాల శివారులోమరియు రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల శివారుల్లో గల మొత్తం 29 ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ కాయిల్స్ చోరీకి గురైనట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో భిక్కనూర్, రాజంపేట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అదేవిధంగా, రామేశ్వరపల్లి గ్రామ అసిస్టెంట్ లైన్మెన్ ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, 09.09.2026న రమేశ్వరపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ను చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, వారిని అడ్డుకున్న లైన్మెన్ ప్రభాకర్‌పై హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదుపై భిక్నూర్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో భిక్నూర్ సీఐ జె. నరేష్, సీసీఎస్ సీఐ సంతోష్ కుమార్, భిక్నూర్ ఎస్ఐ అనిల్, సీసీఎస్ ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిపి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు మరియు ఇతర సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ చోరీలకు పాల్పడుతున్న అనుమానితులను గుర్తించారు. తేదీ:11.09.2026న భిక్నూర్ మండల పరిధిలో మరలా ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయల్స్ చోరీ చేసేందుకు నిందితుల కదలికలను గమనించి పరివార్ హోటల్ దగ్గర ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు చేపట్టారు.
కేసు వివరాల్లోకి వెళితే.. అన్నదమ్ములు.. దొంగతనాలే వృత్తిగా
విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురు నిందితులు సొంత అన్నదమ్ములే కావడం గమనార్హం . నలుగురూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి, జల్సాలకు మరియు ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
పగటి వేళల్లో రెక్కీ నిర్వహించి, రాత్రి సమయంలో లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల్లోని ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పరికరాలను చోరీ చేస్తారు. చోరీ చేసిన కాపర్ తదితర సామగ్రిని విక్రయించి వచ్చిన డబ్బును వారు జల్సాలకు వినియోగిస్తారు.
జైలు నుంచి వచ్చినా మారని పద్ధతి
విచారణలో నిందితులు గతంలో కూడా దొంగతనం కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లినట్లు వెల్లడైంది. జైలు నుంచి విడుదలైన అనంతరం కూడా తమ పద్ధతిని మార్చుకోకుండా తిరిగి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల వివరాలు:
1. బల్జీర్ సింగ్ చతుర్ సింగ్ టాక్, తండ్రి: చతుర్ సింగ్ టాక్, (నార్సింగ్, తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాబరీ కేసు)
2. రూప్ సింగ్ చతుర్ సింగ్ టాక్, తండ్రి: చతుర్ సింగ్ టాక్,
(బాన్సువాడ టౌన్ పోలీస్ స్టేషన్లో రాత్రి పూట ఇంటి దొంగతనం రెండు కేసులు, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాబరీ కేసు )
3. లకన్ చతుర్ సింగ్ టాక్, తండ్రి: చతుర్ సింగ్ టాక్,
4. పరారీలో మరో నిందితుడు).
పై నలుగురు నిందితులు 52 ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు, ఒక హత్య యత్నం. ఒక రాత్రి పూట ఇంటి దొంగతనం నేరాలు ఇప్పటికే చేసి ఉన్నట్లు గుర్తించడం జరిగింది.
పరారీలో ఉన్న నిందితుడిని అతి త్వరలో పట్టుకొనుటకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నారు. అరెస్ట్ కాబడిన 3 నిందితులను కోర్టు ముందు హాజరుపర్చబడును.
నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న వాహనాలు, వస్తువుల వివరాలు
1.యమహా FZ . 2.మొబైలు ఫోన్లు-01 3.ఆక్సర్ బ్లేడ్ – 09 4. కటింగ్ ప్లేయర్-01 5. కట్టర్-01 6. పానలు- 09 7. రింగ్ పానలు -10 8. రాడ్స్ – 03 9. కాపర్ వైర్ – 30 కిలోలు.
అత్యంత చాకచక్యముగా వ్యవహరించి ఈ కేసును ఛేదించిన కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, భిక్కనూర్ సీఐ జె. నరేష్, సీసీఎస్ సీఐ బి. సంతోష్ కుమార్, భిక్కనూర్ ఎస్ఐ ఎస్. అనిల్, సీసీఎస్ ఎస్ఐ మహేష్, భిక్కనూర్ ఏఎస్ఐ వెంకట్రావు, ఏఎస్ఐ గంగారెడ్డి, ఐటీ కోర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, భిక్కనూర్ కానిస్టేబుళ్లు బాలకృష్ణ, శ్రీకాంత్, కిషన్, గణేష్, రమేష్, శేఖర్, సీసీఎస్ కానిస్టేబుళ్లు లక్ష్మీకాంత్, చేతన్, స్వామి, రాజేందర్, మైసయ్య, మహేందర్లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అభినందించారు.






