
కరీంనగర్: తెలుగు కే న్యూస్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ, అవసరం లేని వైద్య పరీక్షలు చేయించి రోగులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్న ఆసుపత్రులపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రైవేట్ ఆసుపత్రుల్లో అవసరం లేకున్నా వివిధ రకాల పరీక్షలు, స్కానింగ్‌లు చేయిస్తూ కమిషన్లు పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ఆసుపత్రుల్లో అధిక వైద్య ఫీజులు, మందుల ధరలు, గది అద్దెలతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. విజిటింగ్ డాక్టర్ల పేరుతో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సలు, పరీక్షలు, గదుల అద్దెలకు సంబంధించిన ధరల పట్టికను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల బిల్లింగ్ విధానాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందులు, అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు. వైద్యం సేవారంగమే తప్ప వ్యాపారంగా మారకూడదని హరిప్రసాద్ అన్నారు.కవితమ్మ నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఎంత పెద్ద అనారోగ్యం వచ్చినా ప్రజలకు ఆసుపత్రుల్లో ఒక్క రూపాయి చెల్లింపు లేకుండా ఉచిత వైద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం, ఆరోగ్య శాఖ ఇప్పటికైనా స్పందించి ప్రైవేట్ ఆసుపత్రులపై నిఘా పెంచి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హరిప్రసాద్ హెచ్చరించారు.






