
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి: తెలంగాణ రక్షణ సేన
కరీంనగర్: తెలుగు కె న్యూస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. హామీల అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాటలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం, రైతులకు రూ.500 బోనస్ వంటి హామీల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గుర్తింపు కార్డులు, సంక్షేమ బోర్డు ఏర్పాటు వంటి హామీలను కూడా అమలు చేయాలని అన్నారు.విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, యువతకు 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల సహాయం, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పింఛన్, మహిళలకు తులం బంగారం వంటి హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, బీసీ సంక్షేమానికి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు మంత్రివర్గ విస్తరణలో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుగా ఉన్న రూ.12 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని, అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి రూ.12 లక్షల సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మైనారిటీల సంక్షేమానికి హామీ ఇచ్చిన రూ.4 వేల కోట్ల నిధులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని, ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏటా రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులు, ప్రాక్టీసింగ్ న్యాయవాదులకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు. గల్ఫ్ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయకపోతే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ప్రజలను కలుపుకొని మరింత ఉధృతమైన ప్రజా ఉద్యమాలు చేపడతామని హరిప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు హామీల ప్రభుత్వం కాకుండా హామీలను అమలు చేసే నాయకత్వం అవసరమని, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత నాయకత్వంలోనే అది సాధ్యమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి లింగంపల్లి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, కరీంనగర్ నియోజకవర్గం ఇన్చార్జి అంకం శివరాణి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, జిల్లా పార్టీ సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, బుడిగె పరుశురాం గౌడ్, భాసవేణి రాజేందర్, చంటి శ్రీనివాస్, మేక వినోద్, శివసారం రాజకుమార్, మడిపల్లి వినీత్, గాలిపల్లి రత్నాకరచారి, నుతి సాయి చరణ్, ఎం.డి. రాజీ, పూసాల పవన్, ఎం.డి. హుస్సేన్, నగునూరి శంకర్, రంగరవేణి ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.






