తెలంగాణను ప్రపంచస్థాయి అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం

హైదరాబాద్, తెలుగు కే న్యూస్ జూన్ 11:   తెలంగాణను ప్రపంచస్థాయి అభివృద్ధి గమ్యంగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జపాన్, దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ద్వారా బలమైన పునాదులు వేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో కొందరు దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని, అలాంటి కుట్రలను ప్రజలు గమనించాలని ఆయన కోరారు. తెలంగాణ పురోగతిని చూసి కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నప్పటికీ, ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ దిశగా నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
ఫ్యూచర్ సిటీలో కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా, గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలు, ప్రపంచస్థాయి విద్యా సంస్థలు, స్కిల్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు తెలంగాణ అభివృద్ధికి కొత్త మైలురాయిగా ఫ్యూచర్ సిటీ నిలుస్తుందని పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.