
ఘన స్వాగతం మధ్య పార్టీ జెండా ఆవిష్కరణ.. పాంచజన్యం లక్ష్యాలను వివరించిన కవిత
బెల్లంపల్లి, జూన్ 15 (తెలుగు కే న్యూస్): బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కవిత, అనంతరం తెలంగాణ రక్షణ సేన జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, బెల్లంపల్లి నడిబొడ్డున పార్టీ జెండా ఎగురవేయడం గర్వకారణమని పేర్కొన్నారు. బెల్లంపల్లి ప్రజల ఆశీస్సులు తమకు కావాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఆరోపించిన ఆమె, పట్టణంలోని కోర్టు రహదారి దయనీయ స్థితిలో ఉందని విమర్శించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని కవిత ఆరోపించారు. పెన్షన్ల పెంపు, రైతుల ధాన్యం కొనుగోలు వంటి అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.
తెలంగాణ రక్షణ సేన ప్రధానంగా ఐదు కీలక అంశాలతో రూపొందించిన ‘పాంచజన్యం’ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్తోందని తెలిపారు. విద్య, వైద్యం, యువత ఉపాధి, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం అంశాలకు తమ పార్టీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్య సేవలు అందిస్తామని, యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణ సదుపాయాలు కల్పించి ఉపాధి అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.వచ్చే ఎన్నికల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే స్థానాన్ని టీఆర్ఎస్ కచ్చితంగాగెలుచుకుంటుందని కవిత ధీమా వ్యక్తం చేశారు.




