అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్‌కు సొంత భవనం ఎప్పుడూ?

వర్షాలకు నీట మునుగుతున్న అద్దె భవనం.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పోలీస్ సిబ్బంది

 

కే-24 న్యూస్ | అడవిదేవులపల్లి | జూన్ 21
ప్రజల భద్రత కోసం 24 గంటలు విధులు నిర్వహించే పోలీస్ శాఖ సిబ్బందే నేడు కనీస వసతుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్‌లో కనిపిస్తోంది. మండల కేంద్రంలో కొనసాగుతున్న పోలీస్ స్టేషన్ ఇప్పటికీ అద్దె భవనంలోనే కొనసాగుతుండగా, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పోలీస్ స్టేషన్ భవనం ప్రధాన రహదారి స్థాయి కంటే సుమారు రెండు అడుగుల దిగువన ఉండటంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు స్టేషన్ మొత్తం నీట మునిగింది. రెండు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో రికార్డులు, కార్యాలయ నిర్వహణ, సిబ్బంది విధులకు అంతరాయం కలిగిందని పోలీసులు తెలిపారు.
ఇప్పటికే సరైన వసతులు లేక ఇరుకైన రెండు గదుల్లోనే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తమ సొంత డబ్బులతో మట్టి తోలించి భవనం స్థాయిని పెంచేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా సబ్ ఇన్‌స్పెక్టర్ వి. శేఖర్ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన పోలీస్ స్టేషన్ భవనం అత్యవసరమని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బందికి నివాస వసతి కల్పించేందుకు ప్రత్యేక క్వార్టర్స్ నిర్మించాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజల రక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి కనీస మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్‌కు సొంత భవనం మంజూరు చేసే దిశగా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, పోలీస్ సిబ్బంది కోరుతున్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.