విద్యా వ్యవస్థ పునర్నిర్మాణానికి ఇది తొలి అడుగు.

మారమోని శ్రీశైలం యాదవ్ వ్యవస్థాపక అధ్యక్షులు, ట్రూ హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ..

శేరిలింగంపల్లి తెలుగు కె న్యూస్ .. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశ విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత నెలకొల్పే దిశగా ఒక కీలక పరిణామమని ట్రూ హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మారమోని శ్రీశైలం యాదవ్ పేర్కొన్నారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న అవకతవకలు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన ఘటనలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేపట్టిన నిరంతర ఉద్యమానికి ఈ పరిణామం ఒక విజయంగా నిలిచిందని ఆయన అన్నారు. విద్యార్థుల ఐక్యత, పట్టుదల, ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటం ముందు కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి రావడం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు.
దేశ భవిష్యత్తును నిర్మించేది విద్యా వ్యవస్థ. అలాంటి పవిత్రమైన వ్యవస్థలో ప్రశ్నపత్రాల లీకేజీలు, అవినీతి, నిర్లక్ష్యం వంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల కష్టాన్ని, తల్లిదండ్రుల ఆశలను దెబ్బతీసే ప్రతి అక్రమానికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి, యువతకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వారి పోరాట స్ఫూర్తి దేశ ప్రజాస్వామ్యానికి బలాన్ని చేకూర్చిందన్నారు.
ఇకపై దేశంలో కానీ, రాష్ట్రాల్లో కానీ ఏ పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజీ జరిగినా సంబంధిత అధికారులపై, బాధ్యత వహించే మంత్రులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. బాధ్యులపై వేగవంతమైన విచారణ జరిపి, చట్టప్రకారం కఠిన శిక్షలు విధించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అలాగే దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, ప్రశ్నపత్రాల భద్రతను మరింత బలోపేతం చేయాలని, స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి పూర్తిస్థాయి పారదర్శకతతో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
విద్యార్థుల ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత లభించేలా, అవినీతి మరియు అక్రమాలకు పూర్తిగా తావులేని విద్యా వ్యవస్థను నిర్మించడమే నిజమైన సంస్కరణల లక్ష్యమని ఆయన అన్నారు. దేశ యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.