కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

ట్రాఫిక్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి – జిల్లా ఎస్పీ
కామారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ భవనానికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి, ప్రజలకు మరింత అనుకూలంగా నవీకరించిన ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర , ఈరోజు ప్రారంభించారు. పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహన రద్దీ, ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను మరింత మెరుగుపరిచారు.
ఈ సందర్భంగా కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ గౌడ్ ని జిల్లా ఎస్పీ స్వయంగా ఆయన విధి నిర్వహణ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. ట్రాఫిక్ నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం, వేగవంతమైన స్పందనతో విధులు నిర్వహించాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలో పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌కు అవసరమైన పోలీసు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. రహదారులపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజలకు సురక్షితమైన ప్రయాణ వాతావరణం కల్పించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ట్రాఫిక్ పోలీసులు చట్టాలను అమలు చేయడమే కాకుండా ప్రజలకు సేవలందించే బాధ్యతను కూడా నిర్వర్తించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య కేంద్రాలు మరియు ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్ ను ఉల్లంఘించడం వంటి చర్యలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు గుర్తులు, పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ట్రాఫిక్ క్రమశిక్షణతోనే ప్రమాదాలను తగ్గించి సురక్షిత సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.
“ట్రాఫిక్ నియమాలు పాటించడం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు… మీ కుటుంబం కోసం, మీ ప్రాణాల కోసం తీసుకునే ఉత్తమ నిర్ణయం. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలి.” అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపీఎస్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి , ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ , కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసు అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.