కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ ఆగస్టు 10 జైలు భరో విజయవంతం చేయాలి

నిజామాబాద్ జిల్లా,నవీపేట, ఆగస్టు 6: ఆగస్టు 10న నిర్వహించే జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం నవీపేట మండల కేంద్రంలో కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దేవేందర్ సింగ్, సీఐటీయూ జిల్లా నాయకుడు నాయక్‌వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. రైతులను సంక్షోభంలోకి నెట్టి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా విత్తన సవరణ బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు వంటి చట్టాలను తీసుకురావడం సరికాదన్నారు. అలాగే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడాన్ని తప్పుబట్టారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తూ కొత్త విధానాలను అమలు చేయడం వల్ల రైతులు, కార్మికులు, కర్షకులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు విడగొట్టు చిన్న ఒడ్డెన్న, నందిగామ గ్రామ కార్యదర్శి బైరి కిరణ్, కర్రె శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కన్వీనర్ పి. వసంత్, కేవీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.