దర్యాపూర్ తండాలో ఘనంగా తీజ్ పండుగ

నిజామాబాద్ జిల్లా,నవీపేట మండలం:- దర్యాపూర్ తండాలో బంజారా సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే తీజ్ పండుగను యువతులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పండుగ ప్రారంభానికి ముందు యువతులు పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని, ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించి పండుగ ఏర్పాట్లను చేపడుతున్నారు.
గోధుమలు, శనగలను సేకరించి గోధుమలను నానబెట్టి మొలకెత్తించేందుకు ప్రత్యేకంగా బుట్టలను తయారు చేస్తున్నారు. మేరామ అమ్మవారు, సేవాలాల్ మహారాజ్, సీత్లాభవాని పేర్లతో సిద్ధం చేసిన బుట్టల్లో తండా పెద్దలు పుట్టమట్టి, పశువుల ఎరువు కలిపిన మట్టిని నింపి నానబెట్టిన గోధుమలను చల్లడంతో తీజ్ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. గోధుమ మొలకలను తీజ్‌గా పిలుస్తారు.
తొమ్మిది రోజుల పాటు యువతులు ప్రత్యేక ఉపవాసాలు పాటిస్తూ, ఉప్పు–కారం లేని ఆహారం తీసుకుంటూ, మాంసాహారానికి దూరంగా ఉంటూ సంప్రదాయ నియమాలను అనుసరిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బుట్టల్లో నీరు పోస్తూ తీజ్ మొలకలను పెంచుతారు.
ఈ కార్యక్రమంలో 16వ వార్డు సభ్యులు మెగావత్ ప్రేమ్‌సింగ్ నాయక్‌తో పాటు తండా పెద్దలు బాన్సీ నాయక్, శర్మన్, గణేష్, శ్రీనివాస్ చారి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.