విద్యనభ్యసించిన పాఠశాల అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేయించిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ

కామారెడ్డి జిల్లా సెప్టెంబర్ 15 : k24 న్యూస్ తెలుగు : ఒక మనిషి జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా… తనను తీర్చిదిద్దిన పాఠశాల జ్ఞాపకాలను మాత్రం ఎప్పటికీ మరచిపోలేడని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.

తాను విద్యనభ్యసించిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఇన్‌చార్జి మంత్రి సీతక్క, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ,

తాను 1971లో విద్యనభ్యసించిన ఈ పాఠశాల తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందన్నారు.

“నేను చదువుకున్న బడి ఇది. ఈ పాఠశాల నాకు కేవలం ఒక విద్యాలయం కాదు… నా జీవితానికి పునాది వేసిన ప్రదేశం. ఇక్కడి నుంచే నా ప్రయాణం ప్రారంభమైంది. అందుకే ఈ బడికి ఏదో ఒక మంచి చేయాలనే తపన ఎప్పటి నుంచో ఉంది” అని ఆయన భావోద్వేగంగా అన్నారు.

తాను ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, తనతో కలిసి చదువుకున్న మిత్రులను, ఆ పాఠశాల జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేనని తెలిపారు.

తాను చదువుకున్న పాఠశాలకు తిరిగి వచ్చి, అదే ప్రాంగణంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రస్తుత విద్యార్థులను కలుసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తనతో కలిసి చదువుకున్న మిత్రులను ఎన్నో సంవత్సరాల తర్వాత అదే పాఠశాలలో కలుసుకోవడం మరపురాని అనుభూతిగా అభివర్ణించారు.

భవనం మారుతుంది… కానీ ఈ బడి నాకు ఇచ్చిన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారవు.

ఈ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి. వారు ఉన్నత స్థాయికి ఎదిగి, తమ పాఠశాలకు, తమ సమాజానికి తిరిగి సేవ చేయాలి” అని షబ్బీర్ అలీ ఆకాంక్షించారు.

కామారెడ్డి బాయ్స్ స్కూల్ అభివృద్ధి అవసరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయించేందుకు ప్రత్యేకంగా కృషి చేశానని షబ్బీర్ అలీ తెలిపారు.

పాత భవనాన్ని తొలగించి ఆధునిక ప్రమాణాలతో నూతన పాఠశాల భవనాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు నేటి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన వసతులు కల్పించాలన్నదే లక్ష్యమన్నారు.

ఆధునిక తరగతి గదులు, డిజిటల్ విద్యా సౌకర్యాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, ప్రయోగశాలలు, విద్యార్థులకు అవసరమైన ఇతర మౌలిక వసతులతో పాఠశాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ నిధులతో పాటు పాఠశాల అభివృద్ధికి అవసరమైన చోట తన వంతుగా కూడా సహకరిస్తానని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.

చదువు నేర్పిన బడికి మనం రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని పూర్తిగా తీర్చలేకపోయినా… మనకు చేతనైనంత మంచి చేయడం ప్రతి పూర్వ విద్యార్థి బాధ్యత” అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.