
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ
• గణేష్ నవరాత్రి ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో సమగ్ర సమీక్ష
• గణేష్ మండపాల వద్ద 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలి
• గణేష్ నిమజ్జనాల కోసం ముందస్తు భద్రతా, నిమజ్జన రూట్, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలి
• డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
• సోషల్ మీడియాలో వదంతులను నమ్మవద్దు – మతసామరస్యానికి విఘాతం కలిగించే పోస్టులపై కఠిన చర్యలు
• డప్పు కళాకారులను గౌరవిస్తూ, వారి కళలను ప్రోత్సహిస్తూ సాంప్రదాయబద్ధంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి
• జిల్లాలో ఇప్పటికే 3 డీజేలపై కేసులు నమోదు – డీజేలు, సామగ్రి, వాహనాలు స్వాధీనం
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ యం రాజేష్ చంద్ర, ఐపీఎస్ జిల్లాలోని పోలీస్ అధికారులతో పోలీస్ స్టేషన్ల పనితీరు, శాంతిభద్రతల పరిస్థితి, పెండింగ్ కేసులు, దర్యాప్తు, పోలీస్ విధులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. జిల్లాలో నమోదవుతున్న ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తుతో పాటు ఈ-సాక్ష్యా తప్పనిసరి అని మరియు చట్టపరమైన గడువులోగా పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేసి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని సూచించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల భద్రతపై ప్రత్యేక సమీక్ష
ప్రస్తుతం జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రతి గణేష్ మండపాన్ని పోలీస్ అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ప్రతిరోజూ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని ఆదేశించారు.
మండపాల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా పగలు, రాత్రి అనే తేడా లేకుండా మండపాల వద్ద నిరంతరం గస్తీ నిర్వహిస్తూ 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఉత్సవ కమిటీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అవసరమైన భద్రతా సూచనలు అందించాలని తెలిపారు.
గణేష్ నిమజ్జనాలపై ముందస్తు ఏర్పాట్లు
గణేష్ పండుగ ప్రారంభమై రెండో రోజు కావడంతో రేపటి నుంచి కొన్ని కొన్ని ప్రాంతాలలో విగ్రహాల నిమజ్జనాలు జరిగే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిమజ్జనాలు నిర్వహించే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో అవసరమైన పోలీస్ బందోబస్తు, గస్తీ, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేయాలని ఎస్హెచ్ఓలు, సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. గణేష్ నిమజ్జనం, నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా బాధ్యతగా విధులు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.
డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, అమలులో ఉన్న నిబంధనల ప్రకారం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఉత్సవ కమిటీకి ముందుగానే తెలియజేయాలని పోలీస్ అధికారులను సూటిగా తెలియజేయడం జరిగింది.
నిబంధనలు ఉల్లంఘించి డీజేలను వినియోగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో 3 డీజేలపై కేసులు నమోదు చేసి, డీజే సామగ్రితో పాటు వాటిని తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో డప్పు కళాకారులతో నిర్వహించుకునేలా ఉత్సవ కమిటీలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా
సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, ఎక్కడో జరిగిన సంఘటనలను నిర్ధారణ లేని సమాచారాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని జిల్లా ఎస్పీ కోరారు. మతసామరస్యానికి భంగం కలిగించేలా, ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టించేలా అబద్ధపు ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలు, సందేశాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి సోషల్ మీడియాపై ప్రత్యేకంగా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఏదైనా అనుమానాస్పద లేదా వివాదాస్పద సమాచారాన్ని గమనించినప్పుడు దానిని ఫార్వర్డ్ చేయకుండా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన మరియు సురక్షిత వాతావరణంలో జరిగేలా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది సమన్వయంతో, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
ప్రజలు, భక్తులు, ఉత్సవ కమిటీలు పోలీస్ శాఖకు సహకరిస్తూ భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. ఏవైనా అనుమానాస్పద పరిణామాలు లేదా సమస్యలు కనిపించిన వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాసరావు, బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డి, డిసిఆర్బీ డీఎస్పీ గట్టుమల్లు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్‌తో పాటు జిల్లాలోని ఇన్స్పెక్టర్లు, సీఐలు, ఆర్ఎస్ఐలు, ఎస్సైలు, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


