గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా చర్యలు నిఘా నీడలో శోభాయాత్ర..

 

సుమారు 500 మంది సిబ్బందితో బందోబస్తు
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

రామగుండం, తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 22:
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు చోటుచేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 5,189 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో పెద్దపల్లి జోన్ పరిధిలో 2,659, మంచిర్యాల జోన్ పరిధిలో 2,530 విగ్రహాలు ఉన్నాయని పేర్కొన్నారు.నిమజ్జనోత్సవాల సందర్భంగా కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలు, హోంగార్డులు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎస్‌అండ్‌పీసీ సిబ్బందితో కలిపి సుమారు 500 మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగించనున్నారు.పెద్దపల్లి జోన్‌లో 36 నిమజ్జన ప్రదేశాలు, మంచిర్యాల జోన్‌లో 41 నిమజ్జన ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గోదావరి బ్రిడ్జి, గోలివాడ, మంథని గోదావరి ప్రాంతాలు, పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు, మినీ ట్యాంక్‌బండ్, సుల్తానాబాద్ చెరువు, హుస్సేన్‌మియా వాగు, మానేరు వాగు తదితర ప్రాంతాల్లో నిమజ్జనాలు నిర్వహించనున్నారు.మంచిర్యాల జోన్ పరిధిలో గోదావరి బ్రిడ్జి, గూడెం బ్రిడ్జి, గోదావరి పుష్కర ఘాట్, లక్షెట్టిపేట, గౌతమేశ్వర టెంపుల్, మంచిర్యాల, ఇంటెక్‌వెల్, సీతారాంపల్లి, గోదావరి ప్రవాహ ప్రాంతాలు, బెల్లంపల్లి పోచమ్మ చెరువు, చెన్నూరు పెద్దచెరువు, సాలిగాం ప్రాజెక్టు, సల్పాల వాగు తదితర ప్రాంతాలను నిమజ్జనానికి సిద్ధం చేశారు.ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జన ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, ఫ్లడ్‌లైట్లు, క్రేన్లు, ప్లాట్‌ఫారాలు, మంచినీటి వసతి తదితర ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రమాదాల నివారణకు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.నిమజ్జన ప్రాంతాలను సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించడంతో పాటు డ్రోన్ కెమెరాలతో శోభాయాత్రలను పర్యవేక్షించనున్నట్లు సీపీ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగితే వెంటనే స్పందించేలా సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్పారు.గణేష్ ఉత్సవ కమిటీలు వీలైనంత త్వరగా పూజా కార్యక్రమాలను ముగించి, వెలుతురు ఉన్న సమయంలోనే విగ్రహాలను నిమజ్జన ప్రదేశాలకు తరలించాలని సీపీ సూచించారు. శోభాయాత్రల్లో చిన్నారులు, మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాలపై చిన్నారులు ప్రయాణించకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నిమజ్జనం సందర్భంగా పోలీసుల సూచనలను ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని, పోలీస్ శాఖకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేయాలని సీపీ కోరారు. డీజేలు వినియోగించడం, బాణాసంచా కాల్చడం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.భక్తిశ్రద్ధలతో నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవం మతసామరస్యానికి ప్రతీకగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి చేశారు.

 

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.