కలెక్టర్ అధ్యక్షతన మూడవ త్రైమాసిక జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం! 

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 17. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన మూడవ త్రైమాసిక జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, డీఎఫ్ఓ సుబ్బరాజు, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీ రబ్బానీ భాష, డీఎంసీ సభ్యులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, ఆయా శాఖలు సమర్పించిన నివేదికలను జిల్లా కలెక్టర్ సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, తీసుకున్న చర్యలపై స్పష్టమైన నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. డీవీఎంసీ సమావేశంలో ప్రస్తావించిన ప్రతి అంశాన్ని బాధ్యతగా పరిగణించి పరిష్కారం చూపాలని కలెక్టర్ సూచించారు.ఈ సందర్బంగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారులు వారిపట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యలను పరిష్కరించకుండా ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం, వారి పట్ల చులకనగా లేదా దురుసుగా వ్యవహరించడం వంటి చర్యలను సహించబోమని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి, పరిష్కరించగల అంశాలను ఆలస్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, హౌసింగ్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఎస్ఆర్ పురం మండలంలోని అర్హులైన ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులకు సమగ్ర విచారణ జరిపి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన శ్మశాన వాటికలకు స్థలాలు, రహదారి సౌకర్యం వంటి సమస్యలను పరిశీలించి తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల స్థలాలను గుర్తించడం, రహదారులను అభివృద్ధి చేయడం వంటి చర్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై నమోదైన అట్రాసిటీ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, విచారణ మరియు తదుపరి ప్రక్రియలను వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి నెలా సివిల్ రైట్స్ డే నిర్వహించి, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఇంటి పట్టాల విషయంలో అక్రమాలు లేదా అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు వస్తే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన లబ్ధిదారులకు గృహాలు మంజూరు చేసేందుకు అవసరమైన స్థలాలను గుర్తించి, గృహ నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ఏ లబ్ధిదారుడూ గృహ సదుపాయం నుంచి వినతలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుడిపాల మండలం 189 కొత్తపల్లి గ్రామం ఎస్సీ కాలనీ కి సంబంధించిన స్మశానం సంబంధించిన భూమిని ఆర్డీవో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఐదు రోజుల్లో స్మశాన స్థలం ఏర్పాటు చేయాలని ఆదేశించారు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు, రహదారులు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇటీవల ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టినందున, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 74 మంది వెట్టి చాకిరి కార్మికులకు 7 రోజుల్లోపు పరిహారం అందజేయడం జరుగుతుందన్నారు. బంగారుపాళ్యం ప్రాంతానికి సంబంధించిన వెట్టి చాకిరి కార్మికులకు పరిహారం అందినదీ, లేనిదీ పరిశీలించి, అర్హత ఉన్న వారికి పరిహారం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్డీవో లను ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి 154 ఎస్సీ ఎస్టీ బాధితులకు పరిహారం ఒక కోటి,16 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ ఇప్పటివరకు నమోదైన నేరాలను పరిశీలిస్తే, గతంతో పోలిస్తే దాదాపు 30 శాతం వరకు నేరాల నమోదులో తగ్గుదల కనిపిస్తోందని తెలిపారు. అదే సమయంలో కేసుల దర్యాప్తు నాణ్యతను కూడా మరింత మెరుగుపరిచినట్లు చెప్పారు. అట్రాసిటీ కేసుల్లో శిక్షలు పడటానికి సంబంధించి పరిశీలిస్తే, అనేక కేసులు పరస్పర దాడులు, దూషణలు, అవమానపరిచే ఘటనలకు సంబంధించినవిగా ఉంటాయని తెలిపారు. ఇలాంటి కేసుల్లో స్వతంత్ర సాక్షులు లేకపోవడం, శాస్త్రీయ ఆధారాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో న్యాయస్థానాల్లో కేసులను నిరూపించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. కొన్ని సందర్భాల్లో సాక్షులు తమ వాంగ్మూలాలను మార్చుకోవడం కూడా కేసుల ఫలితాలపై ప్రభావం చూపుతోందన్నారు. అయితే తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో మాత్రం దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచి, కేసు మెరిట్ మరియు దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు, ఛార్జ్‌షీట్ దాఖలు వరకు ప్రతి దశలో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఫిర్యాదుదారులు, బాధితుల ఫిర్యాదులను నిబంధనల మేరకు పరిశీలించి, కేసు వాస్తవాలు మరియు దర్యాప్తు ఆధారాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు టీ వరలక్ష్మమ్మ, ఎస్ రవి , వి రాజ్ కుమార్, బి మునీంద్ర నాయక్, కే శంకర్ మాదిగ, ఎంపీ ప్రకాష్ మాదిగ, ఎస్ మునస్వామి, మాజీ మెంబర్ డేవిడ్, తిరుమలేష్,ఆర్డీవోలు, డీఎస్పీలు, తహసీల్దార్లు, మండల స్థాయి అధికారులు, జిల్లాస్థాయి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.