అశోక్ నగర్‌లో తాగునీరు, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికుల విజ్ఞప్తి

కాసిపేట, తెలుగు టీ న్యూస్ సెప్టెంబర్ 22:
కాసిపేట గ్రామపంచాయతీ పరిధిలోని అశోక్ నగర్‌లో తాగునీరు, విద్యుత్ స్తంభాలు, కేబుల్ వైర్ల ఏర్పాటు, డ్రెయినేజీ తదితర సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరుతున్నారు.ప్రధానంగా అశోక్ నగర్‌లోని బ్లాక్ ట్యాంక్ వద్ద మూడు పైపుల ద్వారా తాగునీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం నీటి సరఫరాలో ఇబ్బందులు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.అదేవిధంగా డ్రెయినేజీ పనులు పూర్తికాకపోవడంతో మురుగునీరు తాగునీటి పైపులైన్లలో కలిసే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో కలుషిత నీరు సరఫరా అవుతోందని, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున అధికారులు వెంటనే సమస్యను పరిశీలించాలని కోరుతున్నారు.
విద్యుత్ స్తంభాల ఏర్పాటు, కేబుల్ వైర్లను క్రమబద్ధీకరించడం వంటి పనులు కూడా పూర్తి చేయాల్సి ఉందని స్థానికులు తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక వసతులు ప్రజల ప్రాథమిక అవసరాలని, వీటిపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో కాసిపేట గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని అశోక్ నగర్‌లోని సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తాగునీటి పైపులైన్లను పరిశీలించి కలుషిత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.ప్రజలకు సురక్షితమైన తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యం అందేలా తక్షణ చర్యలు చేపట్టాలనిఅశోక్ నగర్ వాసులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.