
రూ.1.05 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం
సిద్దిపేట: తెలుగు కే న్యూస్ బాలికను కిడ్నాప్ చేసిన కేసుతో పాటు పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కొమ్ముగళ్ల బాలకృష్ణ (35)కు న్యాయస్థానం 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1,05,000 జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి వై. జయప్రసాద్ తీర్పు వెలువరించారు.వివరాల ప్రకారం.. సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 27 జనవరి 2018న బాలిక కిడ్నాప్‌కు సంబంధించిన కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేపట్టిన అప్పటి ఇన్‌స్పెక్టర్ నందీశ్వర్ రెడ్డి సమగ్రంగా దర్యాప్తు నిర్వహించి, సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాదుల ఆత్మారాములు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో కేసు విచారణకు అవసరమైన సహకారం అందించారు. ప్రస్తుత ఇన్‌స్పెక్టర్ పి. మహేందర్ రెడ్డి, సాక్ష్యాలు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్ వాసుదేవరావు, లైజనింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సీడీఓ బాపురెడ్డి, భరోసా ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ బి. దుర్గ, భరోసా లీగల్ అధికారి సౌమ్య, భరోసా సిబ్బంది కేసు విచారణలో సహకరించారు.పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించింది. అనంతరం బాలకృష్ణకు 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1,05,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ అభినందించారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, నేరాలకు పాల్పడిన వారికి చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.


