చిన్న చినుకుకే బురదమయం… సొంత ఖర్చుతో రోడ్డు మరమ్మతు చేసిన సర్పంచ్

ప్రజల కష్టమే తన బాధ్యతగా భావించిన గోపాల్ రెడ్డి సేవాభావానికి గ్రామస్తుల ప్రశంసలు

 

  గన్నేరువరం మండలం, చుక్కారావుపల్లి (K24 NEWS తెలుగు):
ప్రజా సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించే ప్రజాప్రతినిధులు అరుదుగా కనిపిస్తున్న ఈ రోజుల్లో, చుక్కారావుపల్లి గ్రామ సర్పంచ్ అరుకొంతం గోపాల్ రెడ్డి తన సేవా దృక్పథంతో గ్రామస్తుల మనసులు గెలుచుకున్నారు.
గ్రామంలో చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారి బురదమయంగా మారి, పాదచారులు, విద్యార్థులు, మహిళలు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని గమనించిన సర్పంచ్ అధికారుల స్పందన కోసం ఎదురుచూడకుండా స్వయంగా ముందుకొచ్చారు.
తన సొంత నిధులతో రోడ్డుపై అవసరమైన మెటీరియల్ వేయించి మరమ్మతులు చేపట్టించారు. దీంతో రహదారిపై ప్రయాణం సులభతరం కావడంతో పాటు ప్రమాదాల ముప్పు కూడా గణనీయంగా తగ్గింది. సర్పంచ్ చొరవతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
సమస్యలను కేవలం గుర్తించడం మాత్రమే కాకుండా, వెంటనే పరిష్కరించే నాయకత్వం చూపిన గోపాల్ రెడ్డిని గ్రామస్తులు అభినందిస్తూ, “ప్రజా సేవే పరమావధి” అనే మాటను చేతల్లో చూపించారు అని కొనియాడుతున్నారు.
గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న సర్పంచ్ అరుకొంతం గోపాల్ రెడ్డి సేవా తత్వం ఇతర ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిగా నిలుస్తుందని గ్రామ పెద్దలు, యువత, మహిళలు ప్రశంసించారు

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.