
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, బుధవారం పరిశీలించారు.
తొలుత ట్రాఫిక్ గణపతిని దర్శించుకున్న అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లతో కలిసి ప్రత్యేక బస్సులో నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించారు. కామారెడ్డి ఓల్డ్ బస్టాండ్ – ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ముఖ్య ప్రాంతాల గుండా బాంబే క్లాత్, పాన్ చౌరస్తా, బడా మసీద్, రైల్వే ఫ్లైఓవర్, నిజాంసాగర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ మీదిగా నిమజ్జన మార్గాన్ని పరిశీలిస్తూ, నిమజ్జన ముగింపు ప్రదేశమైన టేకిర్యాల్ చెరువు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వరకు రూట్లోని అన్నీ ప్రాంతాలను సందర్శించారు.
ఈ సందర్భంగా నిమజ్జన రూట్లో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, రహదారుల పరిస్థితి, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, బారికేడ్లు, అత్యవసర మార్గాలు, విగ్రహాల తరలింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూట్లో గుర్తించిన సమస్యలను నిమజ్జన కార్యక్రమానికి ముందే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచించారు.
జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్, మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి తదితర అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన మార్గంలో భక్తులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ మరియు రహదారి సంబంధిత పనుల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన కార్యక్రమంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు, భక్తులు మరియు ప్రజల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు మరియు వైద్య సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రెస్క్యూ వ్యవస్థను అందుబాటులో ఉంచాలని సూచించారు. నిమజ్జన రూట్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేయడంతో పాటు, సీసీ కెమెరాలు మరియు డ్రోన్ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ డీజేలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుందామని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. అధిక శబ్దంతో కూడిన డీజేల కారణంగా చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అమలులో ఉన్న నిబంధనలు, ఆదేశాల మేరకు డీజేల వినియోగంపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశారు.
గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయ పద్ధతుల్లో, శాంతియుతంగా మరియు ఆనందోత్సాహాలతో నిర్వహించాలని, నిమజ్జన సమయంలో పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సూచించే భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ కోరారు. నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్హెచ్ఓ బి. నరహరి, కామారెడ్డి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్, పోలీస్, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, ఆర్గనైజర్లు పాల్గొన్నారు.


