దుబ్బాకలో భారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు – 80 తులాల బంగారం, 5.5 కిలోల వెండి స్వాధీనం

దుబ్బాక, K24న్యూస్ తెలుగు జూలై 15: దుబ్బాక పట్టణంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించి నిందితుడు *చిక్కుడు కృష్ణ అలియాస్ వెంగాలి బిక్షపతి (37)*ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 80 తులాల బంగారం, 5.5 కిలోల వెండి, రూ.1,300 నగదు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
చింత రాజ్‌కుమార్ కుటుంబం తీర్థయాత్రకు వెళ్లిన సమయంలో జూన్ 28న ఇంటిలో చోరీ జరగగా, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ పర్యవేక్షణలో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, సుమారు 400–500 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితుడిపై సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ తదితర జిల్లాల్లో 63 చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసులో మరో నిందితుడి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను కమిషనర్ అభినందించారు. అలాగే ప్రజలు ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.