రాంపూర్–ఎల్కే ఫారం–ఫతేనగర్ ప్రజల రోడ్డు కష్టాలు.. వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి

    నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలంలోని:- రాంపూర్, ఎల్కే ఫారం, ఫతేనగర్ గ్రామాల ప్రజలు రహదారి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది రైల్వే పనుల కారణంగా నర–రాంపూర్ మధ్య ఉన్న పాత రహదారిని మూసివేయడంతో మండల కేంద్రానికి వెళ్లేందుకు మూడు కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 13 కిలోమీటర్లు అదనంగా చుట్టుముట్టి ప్రయాణించాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    అత్యవసర పరిస్థితుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారిందని వారు తెలిపారు. ఒకప్పుడు పది నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉండగా, ప్రస్తుతం గంటకు పైగా సమయం పడుతోందని పేర్కొన్నారు. గర్భిణులు, పాముకాటు బాధితులు, గుండెపోటు రోగులు సమయానికి వైద్యం అందుకోలేక ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
    వర్షాలతో రహదారులు బురదమయంగా మారడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని, బస్సులు, ఆటోలు సక్రమంగా రాక గ్రామాల రాకపోకలు దెబ్బతిన్నాయని తెలిపారు. రైతులు కూడా పొలాలకు వెళ్లడం, వ్యవసాయ యంత్రాలు తరలించడం, మందుల పిచికారీ వంటి పనులు నిర్వహించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
    ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, రైల్వే శాఖ, రోడ్లు-భవనాల శాఖ అధికారులు తక్షణమే స్పందించి రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. “రోడ్డు వేస్తే ప్రాణాలు కాపాడిన వారవుతారు” అంటూ తమ సమస్యను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.