రాజేందర్‌రెడ్డి మృతి కేసులో ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలి: బాధిత కుటుంబం డిమాండ్

 

తెలుగు కే న్యూస్ కరీంనగర్, జూలై 28: గన్నేరువరం మండలం గుండ్లపల్లి మాజీ సర్పంచ్ రాజేందర్‌రెడ్డి మృతి కేసులో సంబంధిత ఎస్సై నరేందర్‌రెడ్డిపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకుని, వెంటనే సస్పెండ్ చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని, పోలీసు ఉన్నతాధికారులను కోరారు.మంగళవారం రాజేందర్‌రెడ్డి భార్య సమత తన కుమారుడు, కుమార్తెతో కలిసి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మరణించి ఆరు రోజులు గడిచినా కేసులో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. పోస్టుమార్టం అనంతరం నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని ఆరోపించారు.ఎమ్మెల్యే పీఏ మురళీధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఎలాంటి సమగ్ర విచారణ నిర్వహించకుండా ఎస్సై నరేందర్‌రెడ్డి తన భర్తపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారని, ఆ చర్యల వల్లే తీవ్ర మనోవేదనకు గురై తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని సమత ఆరోపించారు.విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఎస్సై నరేందర్‌రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేసి, స్వతంత్ర విచారణ చేపట్టి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనకు బాధ్యులైనవారందరిపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కోరారు.బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో అధికారులు ఆలస్యం చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేపడతామని, అవసరమైతే సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తామని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

 

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :